బీజేపీ నేతలు వణుకుతున్నారు, కర్రుకాల్చి వాత పెట్టండి – కేసీఆర్

November 28th 2020, 15:30
KCR TRS

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌… బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను ఢిల్లీ పాలిటిక్స్‌లోకి వస్తానని.. బీజేపీ నేతలు వణికిపోతున్నారన్నారు. అందుకే నన్ను హైదరాబాద్‌లో కట్టడి చేసేందుకు వరదలా వస్తున్నారని ఫైర్‌ అయ్యారు. వరదలు వచ్చినప్పుడు పైసా సాయం చేయనివాళ్లు.. ఎన్నికలనగానే క్యూ కడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు పైసా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు కేసీఆర్‌.

ఎల్‌బీ స్టేడియం వేదికగా జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీనీ టార్గెట్‌ చేశారు. ప్రధాని మోదీతోపాటు… బీజేపీ నేతల తీరును కేసీఆర్‌ ఎండగట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌ వరదలపై తాము ప్రధాని మోదీని 1350 కోట్లు ఇవ్వాలని కోరితే.. 13 పైసలు కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ దేశంలో లేరా… భారతీయులు కారా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. బెంగళూరు, అహ్మదాబాద్‌తోపాటు ఇతరచోట్ల వరదలు వచ్చినప్పుడు సాయం చేసిన కేంద్రం… హైదరాబాద్‌లో వస్తే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలను కోరారు కేసీఆర్‌.

హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ నేతల ప్రచారంపై కేసీఆర్‌ తనదైన స్టైల్‌లో స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమాషా జరుగుతోందని.. ప్రచారం కోసం బీజేపీ జాతీయ నేతలు క్యూకట్టారని అన్నారు. హైదరాబాద్‌లో వరద వచ్చినప్పుడు రూపాయి సాయం చేయనివాళ్లు.. ఇప్పుడు వరదలా వస్తున్నారని విమర్శించారు. బక్కపల్చని కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమంది వస్తారా అని నిలదీశారు.

పక్కరాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా.. వారితో ఒరిగేది ఏమీ లేదన్నారు కేసీఆర్‌. ఎన్నికలప్పుడు ఊకదంపుడు ఉపస్యానాలు ఇస్తే.. ప్రజల కడుపు నిండబోదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏదైనా జరిగితే వారు బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు. స్థానికంగా ఉనన నేతలే ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. వంచకులు, మోసగాళ్లు ఎన్నికలప్పుడు చేసే జిమ్మిక్కులు నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలను కోరారు.

దేశాన్ని నడపడంలో రెండు జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని కేసీఆర్‌ విమర్శించారు. అందుకే దేశంలో కొత్త విధానం, నూతన పంథా రావాలన్నారు. మూస రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. తానెప్పుడూ ఫ్రంట్‌ పెడతానని చెప్పలేదన్నారు. కేసీఆర్‌ దేశ రాజకీయాలపై మాట్లాడితే జాతీయ పార్టీల నేతలు ఎందుకు వణుతున్నారని ప్రశ్నించారు. మొత్తానికి ఎల్‌బీ స్టేడియం సభ.. గులాబీ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపింది. కేసీఆర్‌ స్పీచ్‌ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపింది.

Loading...


Share your thoughts!